Tuesday, April 24, 2007

పిచ్చి పిచ్చి ఆలోచనలు - Random Thoughts

అన్నయ్య పెళ్ళి బాగా జరిగింది. మరుసటి రోజు వ్రతం కూడా, ఆ సత్యన్నారాయణ స్వామి దయ వల్ల బాగానే జరిగింది. పెట్టిన శెలవులు అయ్యిపొయినవి కాబట్టి ఇక తప్పక బెంగుళూరు తిరుగు ప్రయాణం అయ్యాను. నా i-Pod కాస్తా తమ్ముడు అడిగితే కాదనలేక ఇచ్చేశాను. అలా రైలులో కిటికీ పక్కన ఖాళీగా కూర్చొని ఆలోచించటం మొదలు పెట్టాను. ఇక చూసుకో ఒకటే ఆలోచనలు!!! ఒకదాని వెంట ఒకటి వరుసగా... లేదు లేదు, వరుస లేదు పాడు లేదు... అలా అలా వస్తూనే ఉన్నాయి. అప్పుడు వచ్చిన ఆలోచనే ఈ టపా కూడా.
i-Pod Shuffle బావగారికి ఇస్తే బాగుండేది. నేను వ్రతం రోజు కుర్తా-పైజమా వేసి అధరగొట్టినట్లు ఎవరికీ చెప్పకూడదు. చెప్తే ఏడిపిస్తారు. వ్రతం రోజు వచ్చిన బంధువులలో అమ్మాయిల్ని శ్రద్దగా చూసి వుంటే నేను ఒక ఇంటివాడిని అవ్వటం తేలిక అయ్యి ఉండేది :-( అస్సలు ఖాళీగా ఉన్నప్పుడల్లా చెవిలో పాటలు పెట్టుకొంటే ఈ అలోచనలు అన్నింటికి అడ్డుకట్ట వేసినట్లే. విన్న పాటలే మళ్ళీ మళ్ళీ వింటూ... F.M. అయితే జాకి చెప్పే సోది వింటూ... సమయం వృధా తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. అందరూ రోజూ ఆలోచించటానికి కొంత సమయం కేటాయిస్తే బాగుంటుంది. రైలు ప్రయాణం పలు రకాలుగా బహు సుఖం. సౌకర్యానికి సౌకర్యం, తక్కువ ఖర్చు, రోడ్ల మీద రద్దీ తగ్గుతుంది. రైలు ప్రయాణం సంబందించి మనం పెట్టే ఖర్చంతా తిరిగి ప్రభుత్వం మన కోసమే ఖర్చు పెడుతుంది. రైలు మీద అధారపడి జీవించే లక్షలాది మంది బతుకుతుంటారు. ప్లాట్‌ఫారం మీద రైలు వచ్చిన తరువాత కాకుండా రైలు రాక ముందే ఏ కోచ్ ఎక్కడ ఆగుతందో తెలియజేయగలిగితే ప్రయాణికులకి ఇంకా సౌకర్యంగా ఉంటుంది.
అన్నయ్య పెళ్ళికి ఉదజని బుడగ పెట్టిస్తే బాగుండేది. మనం గమనించం కాని refill water-cans లో మంచి పరిఙానం దాగి ఉంది. ఎవరు కనిపెట్టారో కాని... అవునూ అవి లేకపోతే ఎమైనా ఇబ్బంది పడేవాళ్ళమా??? లేదు, అవి కూడా సౌకర్యం కోసం మాత్రమే. కేవలం అలోచించటానికి ఒక సంస్థ ఉంటే... దానిలో ఉద్యోగులందరూ కేవలం అలోచిస్తూ, ఆ ఆలోచనలని అమలు చేసే పని అంతా outsource చేసేస్తే, ఎంత బాగుణ్ణో. అప్పుడు దాని పేరు "May I think for you?" అని పెట్టొచ్చు.