Tuesday, November 17, 2009

హెల్మెట్ వలన ఉపయోగాలు

.
1. ప్రమాద సమయాల్లో తలకి రక్షణ - శిరస్త్రాణం
2. వర్షం పడుతున్నప్పుడు - గొడుగు
3. కళ్ళకి రక్షణ - కళ్ళ జోడు.
4. శబ్ద కాలుష్యం నుంచి చెవులకి రక్షణ
5. ఈ మధ్య సెల్ ఫోన్స్ హెల్మెట్లోనికి తోసి. బండి నడుపుతూ మాట్లాడుతున్నారు - హాండ్స్ ఫ్రీ
6. చెవులు కప్పి చలి నుంచి రక్షణ కల్పిస్తుంది
7. హెల్మెట్ పెట్టుకొని మనలో మనం ఎంత మాట్లాడుకున్నా, పాటలు పాడుకున్నా ఎవరికీ వినపడదు - సౌండ్ ప్రూఫ్
8. పోలీసుల నుంచి మన జేబుకి రక్షణ
.
.

ఫర్స్ట్ డే! ఫర్స్ట్ షో!! ఫర్స్ట్ టికెట్!!!

...
శుభమా అంటూ ఒక ద్విచక్ర వాహనం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకొని, పూజ చేయించి, ఆఫీసుకి బయలుదేరాను. ఈ ఆనందాన్ని సహోధ్యోగులతో పంచుకుందామని వారి కోసం మిఠాయి కొందామని ఒక బేకరి దగ్గర ఆగాను. చక్కగా ఒక కేజి మిఠాయి కొని, అక్కడి నుంచి ఎంతో "స్వేచ్చ"గా బయలుదేరాను. ఇప్పుడు అన్ని శబ్ధాలు స్పష్టంగా వినపడుతున్నాయి. నిజం చెప్పాలంటే శబ్ధ కాలుష్యం నా చెవులకి చిల్లులు పొడుస్తోంది. తేడా ఏమిటా? అని ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది "నా హెల్మెట్". వామ్మో, హెల్మెట్ బేకరీలో మర్చిపోయి, హాయిగా నా బండి మీద సవారీ చేసుకుంటూ వెళ్తున్నానన్న విషయం అప్పుడర్ధం అయ్యింది. ఇప్పుడు కాని ట్రాఫిక్ పోలీసులు అపారంటే జేబుకి చిల్లు పడుతుంది అని, వెనుతిరిగి సందు-గొందుల్లోంచి బేకరీవైపు బయలుదేరాను. నా దురద్రుష్టంకొద్దీ ఒక సందు చివర నక్కి ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు... అందులో ఒక పొలీసు వచ్చి నన్ను ఆపి పలకరించింది. ఉభయకుశలోపరి అని అన్నాను. "మనలో మన మాట... హెల్మెట్ ఏది బాసూ?" అని అడిగింది. మనలో మనకి హెల్మెట్ ఎందుకులెండి అని అన్నాను. వెంటనే తన బ్లాక్బెర్రి తీసి, నా లైసెన్స్ లాక్కుని ఒక టిక్కెట్ కోసింది. ఇంకా చేసేది ఏమి లేక ఒక వంద సమర్పించుకొని అక్కడి నుంచి బయలుదేరాను. ఆ విధంగా మొట్టమొదటి రోజే ట్రాఫిక్ పోలీసుల రికార్డుల్లోకి ఎక్కింది, నా బండి.
...
...

Monday, November 16, 2009

దగ్గు రహస్యాలు

పక్షుల "కిలకిలా"రావాలు మనకి అర్ధం కావు. ఆవుల "అంబా అంబా" అరుపులు కూడా మనకి అర్ధం కావు. అలాగని వాటికి అర్ధం పర్ధం లేదని మనం అనగలమా? అవి వాటి భాష. అదే విధంగా ఎవరైనా దగ్గుతుంటే కూడా మనకి అర్ధం కాదు.

నేను చెప్పొచ్చేది ఏమిటంటే... దగ్గు కూడా ఒక భాషే. అయితే మనం అందరం దగ్గుతూ ఉంటాం. ఇంతకీ మనకే తెలియకుండా దగ్గు భాషలో మనం ఏమి మాట్లాడతామో తెలుసా? ఆలోచనలు.

నిజమేనండి. మనం దగ్గేటప్పుడు మనకి తెలియకుండా మన ఆలోచనలు బయటికి వచ్చేస్తాయి. ("నీకెవరు చెప్పారు?" అని అడగకండే...)

ఉదాహరణకి ఒకటి వదులుతా, కాసుకోండి. ఏదైనా గదిలోకి ప్రవేశించగానే గొంతు సవరించుకున్నట్లు ఒక చిన్న దగ్గు దగ్గుతాం చూశారా... దానికి అర్ధం మనకందరికీ తెలుసు కదా? మీరు మరీనూ. అన్నీ నాతోనే చెప్పిస్తారు! ఎందుకంటే అప్పుడు మన "ఆలోచనా" విధానం ఇట్లా ఉంటుంది, "నేను వచ్చినా ఇక్కడ ఎవరూ పట్టించుకోవటం లేదేమిటబ్బా???"

మనలో మన మాట... మీకు తెలుసో లేదో కాని, ఎంత దగ్గుతో బాధ పడుతూ ఉన్నా కూడా (ఇక్కడ "ఆలోచనలతో సతమతమవుతున్నా కూడా" అని చదవండి) నిద్ర పోయినప్పుడు దగ్గు ఆగిపోతుంది. అంటే నిద్రపొతే వాటన్నింటికీ విరామం దొరుకుతుందనటానికి ఇది మరొక ఋజువు.